అమరావతి : కాలువలలో పూడికతీత పనులు సరిగా జరగకపోవడం వల్ల సముద్రపు నీరు వెనక్కి వచ్చి నేలలో లవణీయత పెరిగిందని, దీనివల్ల కొబ్బరి చెట్లు అకస్మాత్తుగా చని పోతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు. : కోనసీమ ప్రాంతంలోని రైతులకు అండగా నిలిచేందుకు, చనిపోయిన చెట్ల స్థానంలో నాటే ప్రతి కొత్త కొబ్బరి మొక్కకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 1,000 ఆర్థిక సాయం అందించనుందని అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 1.18 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగు జరుగుతోందని, ఇందులో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే 36,000 హెక్టార్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కాలువలలో పూడికతీత పనులు సరిగా జరగక పోవడం వల్ల సముద్రపు నీరు వెనక్కి వచ్చి నేలలో లవణీయత పెరిగిందని , దీనివల్ల కొబ్బరి చెట్లు అకస్మాత్తుగా చనిపోతున్నాయని ఆయన వివరించారు.
శంకరగుప్తం కాలువ పూడికతీత పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఒక సమగ్ర ప్రాజెక్ట్ కింద ఇతర కాలువలలో కూడా పనులు చేపట్టాలని యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొబ్బరి అభివృద్ధి మండలి సహకారంతో 2017-18 , 2024-25 మధ్య వివిధ పథకాల కింద 5,250 హెక్టార్లలో సాగు చేపట్టారని తెలిపారు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. కొత్త కొబ్బరి తోటల పెంపకానికి రైతులకు రాయితీలు లభిస్తాయని ప్రకటించారు. అలాగే, వారి ఆదాయాన్ని పెంచేందుకు కోకో, అరటి , కూరగాయల వంటి అంతర పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. వీటిని సద్వనియోగం చేసుకునేందుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.















