అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.8,985.41 కోట్లు పంపిణీ చేసిందని తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.6,560.18 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2,425.23 కోట్లు ఉన్నాయని చెప్పారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అమలవుతున్న ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రూ.6 వేలు అందిస్తోందన్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది తొలి విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు కలిపి ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేలు జమ చేసామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయని వెల్లడించారు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. వీరిలో 45,69,817 మంది భూ యజమాని రైతులు, 1,16,021 మంది అటవీ హక్కుల చట్టం (RoFR) కింద సాగు చేస్తున్న రైతు కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం రూ.3,125.47 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసామని తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.782.55 కోట్లు అని వివరించారు. రైతుల గురించి మాట్లాడేవారు చాలా మంది ఉన్నప్పటికీ, రైతు సంక్షేమాన్ని ఆచరణలో చూపించిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని మంత్రి అన్నారు.
















