నూజివీడు/ఏలూరు : సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో ప్రతి రోజూ పండగేనని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో బీసీలకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. వడ్డెర్లను ఎస్టీలో చేర్చే విషయమై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులో స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని సహచర మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి ఆవిష్కరించారు ఎస్. సవిత. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బ్రిటీషర్ల దాష్టీకాలను ఎదిరించి… మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం జరిపిన యోధుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. ఓబన్న చేసిన పోరాటాన్ని ముందు తరాలకు తెలియ జేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారన్నారు. దీనిలో భాగంగా ఓబన్న జయంతిని అధికారికంగా, రాష్ట్ర పండుగగా నిర్వహించాలని శాశ్వత జీవో జారీచేశారన్నారు.
గత సంవత్సరం గుంటూరులో, ఈ ఏడాది అనంతపురంలో ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం జరిగిందన్నారు. నూజివీడులో వడ్డే ఓబన్న విగ్రహం ఆవిష్కరించడం అభినందనీయమని మంత్రి సవిత కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి సవిత తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసిందన్నారు. ఉగాది సందర్భంగా నిరుద్యోగ యువతకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెబుతూ, జాబ్ క్యాలెండర్ విడుదల చేశారన్నారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వ పథకాలతో ఎక్కువగా లబ్ధి పొందేది బీసీలేనని మంత్రి స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో ప్రతి రోజూ పండుగ వాతావరణమే ఉంటోందన్నారు.
