హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో అందుబాటులోకి కుటుంబ సర్టిఫికెట్ తీసుకు వస్తామని తెలిపింది. తహశీల్దార్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల్లో ఫ్యామిలీ సర్టిఫికెట్ లు లభ్యం అవుతాయని పేర్కొంది. కుటుంబ సభ్యుల వివరాలకు అధికారిక ధ్రువీకరణ పత్రంగా పనికి వస్తుందన్నారు ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఏ ప్రభుత్వ శాఖ, సంస్థ అడిగినా సమర్పించేందుకు ఉపయోగ పడుతుందన్నారు. రేషన్ కార్డు ఆధారిత కుటుంబ వివరాలతో సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుందన్నారు. కుటుంబ సభ్యుల సమాచారం కోసం తహశీల్దార్ కార్యాలయం లేదా మీ సేవా కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు మరింత సౌలభ్యం కల్పించడమే లక్ష్యం అని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. ఫ్యామిలీ సర్టిఫికెట్తో కుటుంబ వివరాల ధ్రువీకరణ సులభం కాబోతోందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ ను మీ సేవా కేంద్రాలు, ఆన్లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు. రేషన్ కార్డు డేటాతో అనుసంధానం చేసిన ఈ విధానంలో కుటుంబంలోని 18 ఏళ్లు నిండిన ఏ సభ్యుడైనా సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు భట్టి విక్రమార్క. కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను ఒకే ధ్రువీకరణ పత్రంలో అందించేలా ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని చెప్పారు. ఫ్యామిలీ సర్టిఫికెట్లో కుటుంబ యజమాని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, కుటుంబ యజమానితో ఉన్న సంబంధం, వయస్సు, పుట్టిన తేదీ, లింగం, ఆధార్ నంబర్, ప్రస్తుత నివాస చిరునామా వంటి పూర్తి వివరాలు నమోదు చేయనున్నట్లు చెప్పారు.

















