తిరుపతి : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనం సందర్బంగా భక్తుల రద్దీ ఎక్కువైందని, రికార్డు స్థాయిలో స్వామి వారిని దర్శించు కుంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో తిరుమలతో పాటు టీటీడీ ఆధ్వర్యంలోని అనుబంధ ఆలయాల్లో కూడా రద్దీ కొనసాగుతోందని చెప్పారు. ఈ మేరకు టీటీడీ ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు అనిల్ కుమార్ సింఘాల్. టిటిడి అనుబంధ ఆలయాల్లో క్రమేణా భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో, అందుకు అనుగుణంగా మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయానికి విచ్చేసే దివ్యాంగ భక్తులు సౌకర్యంగా రాకపోకలు సాగించేందుకు చెక్క బల్లలతో బల్ల పరుపు (వుడెన్ ర్యాంప్) ను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా సెల్ ఫోన్, లగేజీ కౌంటర్లు, తాగునీరు తదితర మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఇప్పటికే ఉన్న మరుగుదొడ్లను మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు చంటి పిల్లలకు తల్లులు సౌకర్యవంతంగా పాలిచ్చేందుకు ప్రత్యేక క్యాబిన్లను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు వచ్చే రాకపోకలకు అనుగుణంగా క్యూలైన్లు, భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆలయ ప్రవేశ ద్వారం వద్ద లోహాలను గుర్తించే భద్రతా పరికరాలను ఏర్పాటు చేయాలన్నారు.



















