సింగపూర్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు. పలనాడు జిల్లా కోనూరు వద్ద ఆదివారం కృష్ణానదిలో పడవ బోల్తాపడి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల. సింగపూర్ టూర్ లో బిజీగా ఉన్నప్పటికీ సీఎం ఘటనపై పలనాడు జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులతో ఫోన్ లో సమీక్షించారు. పడవ బోల్తా ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. తక్షణం మృతుల కుటుంబాలకు ఈ మొత్తాన్ని చెల్లించాలని పలనాడు జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు సీఎం.
ఈ ఘటనపై రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ అధికారుల బృందంతో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. పూర్తి స్థాయి నివేదిక సమర్పించటంతో పాటు తదుపరి ఈ తరహా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనపై తదుపరి చర్యల కోసం విపత్తు నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్, సమాచార పౌరసంబంధాల విభాగం డైరెక్టర్ విశ్వనాథ్, జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించాలని సీఎస్ ను ఆదేశించారు సీఎం. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పడవ బోల్తా పడటంతో నదిలో మునిగి నలుగురు మృతి చెందినట్టు సీఎంకు వివరించారు అధికారులు. నదిలో ఇసుక దిబ్బను గుద్దుకుని బోటు బోల్తా పడినట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో గంధం శైను, గంధం సంధ్య, బత్తుల కార్తీక్, కాంతం చైతన్యలు మృతి చెందినట్టు పేర్కొన్నారు.
















