అర్హులైన యువ‌త‌కు కూడా ఎక్స్ గ్రేషియా : నిమ్మ‌ల

సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు

hellotelugu-NimmalaRamanaidu

అమ‌రావ‌తి : వెలిగొండ ప్రాజెక్టులో కటాఫ్ డేట్ తర్వాత కూడా అర్హులైన యువతకు కూడా ఎక్స్ గ్రేషియా అందించేలా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నిర్ణ‌యం తీసుకున్నార‌ని వెల్ల‌డించారు రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. శుక్ర‌వారం ఆయ‌న మార్కాపురంలో మీడియాతో మాట్లాడారు. గెజిట్ సహా, సోషియో ఎకనామిక్ సర్వేలో నమోదు కాని, అర్హులైన వారందరికీ న్యాయం చేయాలని స్ప‌ష్టం చేశార‌ని తెలిపారు. అవార్డు పాస్ కాని యువతకు కూడా ఎక్స్ గ్రేషియా అందేలా చూడాలని సూచించార‌ని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల‌ మేరకు కటాఫ్ డేట్ తర్వాత కూడా అర్హులైన వారికి రూ.169 కోట్ల ఎక్స్ గ్రేషియా ఇచ్చేలా నిర్ణయం తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు నిమ్మ‌ల రామానాయుడు. ఆధునిక దేవాలయాలైన ప్రాజెక్టుల వద్ద భూములు, ఆస్తులు కోల్పోయిన వారందరికీ సాయం అందించేందుకు త‌మ ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చింద‌న్నారు.

మొత్తం 1800 గ్రీవెన్సులు, పిటిషన్లను పరిశీలించి వారికి న్యాయం చేసేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 2019 కటాఫ్ డేట్ నుంచి 2026 వరకూ 18 ఏళ్లు నిండిన యువతకు కూడా రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామ‌న్నారు మంత్రి. నిర్వాసితులకు చెల్లించిన పరిహారానికి అదనంగా రూ.169 కోట్ల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించార‌న్నారు. అవార్డులో లేని నిర్వాసితుల్ని గుర్తించి వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని స్పష్టం చేశార‌న్నారు. ఇప్పటికే 7027 మంది నిర్వాసిత కుటుంబాలకు రూ.905 కోట్ల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజిని అందించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు నిమ్మ‌ల రామానాయుడు. నిర్వాసితులకు నెల రోజులకు సరిపడా రేషన్ కిట్ ను కూడా ఇస్తున్న‌ట్లు తెలిపారు. ఏ ప్రాజెక్టులోనూ ఇవ్వనంత భరోసా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వాలని సీఎం నిర్న‌యం తీసుకున్నార‌ని చెప్పారు.

Exit mobile version