కాకినాడ రూరల్ : ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనుల గురించి ప్రతి ఒక్కరు తెలుసు కోవాల్సిన అవసరం ఉందన్నారు ఆధ్యాత్మికవేత్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వర్ రావు.
దేశ స్వాతంత్ర సంగ్రామం గత చరిత్ర కాదని, అది మన భారతీయుల వారసత్వ సంపద అని అన్నారు.
విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించేందుకు కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో ‘భారతీయం’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు మాట్లాడారు. “ఒక తండ్రి తన జీవితాంతం కష్టపడి ఇల్లు, పొలం, డబ్బు, బంగారం, ఆస్తులు సంపాదిస్తాడు. తాను వాటిని తనతో తీసుకెళ్లలేనని తెలిసినా, తన పిల్లలు వాటిని సద్వినియోగం చేసుకుని తనకంటే గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటాడు. అదే సమయంలో, ఆ సంపద వెనుక ఉన్న తన కష్టం, శ్రమ, విలువలు పిల్లలకు తెలియాలని కూడా ఆశిస్తాడని అన్నారు.
లేదంటే తాము సంపాదించినదంతా కోల్పోయి పిల్లలు తిరిగి మొదటి స్థితికి చేరుకుంటారని భయపడతాడు. మన దేశ స్వాతంత్ర్ సంగ్రామం కూడా అలాంటిదే. ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేసి మనకు స్వేచ్ఛను అందించారు. ఆ సంపదను అనుభవించడం మాత్రమే కాదు… దాని విలువను తెలుసుకుని, కాపాడు కోవడం మన బాధ్యత అని స్పస్టం చేశారు చాగంటి కోటేశ్వర్ రావు. మన వంశం గురించి మనం తెలుసుకున్నట్లే, మన దేశం కోసం త్యాగం చేసిన మహనీయుల గురించి కూడా తెలుసుకోవాలి. సమర యోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ జీవించాలని హితబోధ చేశారు. దేశభక్తి అంటే కేవలం జాతీయ జెండాను ఎగుర వేయడం కాదన్నారు. త్యాగధనులను స్మరించు కోవాలన్నారు.
అండమాన్‌లోని కాలాపాని జైలు గురించి చదివితే సమర యోధులు అనుభవించిన కష్టాలు మనసును కదిలిస్తాయి. ఇరుకైన గదులు, ఒంటరితనం, శారీరక హింస అయినా వారి సంకల్పం మాత్రం చెదర లేదు. గాంధీజీ, నెహ్రూ, లాలా లజపతిరాయ్, టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు వంటి అనేకమంది మహనీయుల జీవితాలను చదివితే స్వాతంత్రం ఎంతటి త్యాగాల ఫలితమో అర్థమవుతుంది. రైతులకు నీరు అందించాలనే ఆకాంక్షకు ప్రతీకగా నిలిచిన ప్రకాశం బ్యారేజీ కూడా ఆయన పేరును గుర్తుచేస్తుంది. ఘంటసాల వెంకటేశ్వర రావు కేవలం గాయకుడిగా మాత్రమే కాకుండా స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు అంతిమయాత్రలో పాల్గొని దేశభక్తి గీతాలు పాడుతూ చివరి వరకు వెంట ఉన్నారు. కళను కూడా దేశసేవకు ఉపయోగించిన మహనీయుడు ఆయన. బంకించంద్ర ఛటర్జీ రచించిన “ఆనందమఠం” వంటి రచనలు దేశభక్తి, క్రమశిక్షణ, దేశం పట్ల బాధ్యత వంటి భావాలను ప్రజల్లో బలపరిచాయి.
