పెద్దపల్లి జిల్లా : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యం పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలనేది తమ లక్ష్యమని అన్నారు. ఆ దిశగానే సర్కార్ ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇళ్లు మంజూరు చేస్తోందని చెప్పారు భట్టి విక్రమార్క. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి ట్రాన్స్‌జెండర్ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
తెలంగాణను అభివృద్ధిలో ప్రపంచ అగ్రగామిగా నిలపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. రామగుండం నియోజకవర్గంలో రూ. 633 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు . అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణంతో సహా పలు కీలక కార్యక్రమాలను ఆయన ప్రకటించారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కోసం ప్రభుత్వం రూ. 22,500 కోట్లు ఖర్చు చేస్తోందని, పనుల సకాలంలో పూర్తిని నిర్ధారించడానికి ప్రతి ఇంటికి రూ. 5 లక్షలను వాయిదాలలో అందిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో సరఫరా చేసిన నాసిరకం బియ్యం స్థానంలో ఇప్పుడు 96 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందుతున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.















