విజయవాడ : నియోజకవర్గాల వారీ కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికతీత, పనుల అంచనాల తయారీపై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. శుక్రవారం ఉన్నతాదికారులతో సమీక్ష చేపట్టారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈఎన్సీ నరసింహమూర్తి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిఈలు , ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు..నియోజకవర్గాల వారీ కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికతీత, పనుల అంచనాల తయారీపై ఫోకస్ పెట్టాలన్నారు. అంచనాల తయారీపై ఇరిగేషన్ అధికారుల అలసత్వంపై మంత్రి నిమ్మల సీరియస్ అయ్యారు.
ఏప్రియల్, మే నెలలో మాత్రమే చేసే పనులకు ఇంకెప్పుడు అంచనాలు రూపొందిస్తారని సిఈలను ప్రశ్నించారు మంత్రి నిమ్మల రామానాయుడు. గతంలో ఏప్రియల్, మే లో చేసే పనులకు జూన్ లో అనుమతులు ఇచ్చే వారన్నారు. గతంలో ప్రభుత్వంలో వ్యవహరించినట్లుగా కాకుండా, ఇరిగేషన్ అధికారులు తీరు మార్చు కోవాలని స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రంలోగా అంచనాలు సమర్పించాలని సిఈలకు ఆదేశాలు జారీ చేశారు నిమ్మల రామానాయుడు. గడువులోగా అంచనాలు సమర్పించని సిఈలు సోమవారం అమరావతి సచివాలయం కి వచ్చి సంజాయిషీ ఇచ్చుకోవాలని హెచ్చరించారు.
