EPFO : అధికారిక ఉపాధిని పెంపొందించి, ఆర్థిక చేరికను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో సంగారెడ్డిలోని ప్రాంతీయ ఈపీఎఫ్ఓ (EPFO) కార్యాలయం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మెస్సర్స్ డెలాయిట్ కన్సల్టింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో “పీఎం వికాసిత్ భారత్ రొజ్‌గార్ యోజన” (PMVBRY) మరియు తాజా సాంకేతిక పరిణామాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ సేవలు, కొత్త పథకం ప్రయోజనాలపై వివరాలు అందించారు.
EPFO – కొత్త ఉద్యోగులకు ప్రత్యేక లాభం
ఆగస్టు 15న ఎర్రకోట నుండి ప్రధాని ప్రకటించిన ఈ పథకం ద్వారా దేశంలో 3.5 కోట్లకు పైగా కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. రూ. లక్ష కోట్ల బడ్జెట్‌తో అమలవుతున్న ఈ పథకం రెండు భాగాలుగా విభజించబడింది – ఒకటి ఉద్యోగుల కోసం, మరొకటి యజమానుల కోసం.
మొదటిసారి ఉద్యోగం చేస్తున్నవారికి:
- నెల జీతం రూ.1 లక్ష లోపే ఉంటే, ప్రభుత్వం నుంచి రూ.15,000 వరకు ప్రోత్సాహకాన్ని పొందే అవకాశం.
- ఈ మొత్తం రెండు విడతలుగా లభిస్తుంది – 6 నెలల సర్వీస్ పూర్తయిన తర్వాత మొదటి విడత, 12 నెలల తర్వాత రెండవ విడత.
యాజమాన్యాల కోసం ప్రోత్సాహకాలు
- EPFOలో నమోదైన అన్ని కంపెనీలకు ఈ పథకం వర్తిస్తుంది.
- కొత్తగా ఉద్యోగులను నియమించే యజమానులకు నెలకు రూ.3,000 వరకు మద్దతు అందుతుంది.
- ఈ సబ్సిడీ రెండు సంవత్సరాలు వరకూ కొనసాగుతుంది.
- ప్రత్యేకించి తయారీ రంగంలో అయితే ప్రోత్సాహకాల కాలాన్ని మూడవ, నాల్గవ సంవత్సరాలకు పొడిగించే అవకాశం ఉంది.
అర్హత నిబంధనలు
- 50 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం ఇద్దరిని,
- 50 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం ఐదుగురిని కొత్తగా నియమించుకోవాలి.
- కొత్తగా నియమించిన ఉద్యోగులు కనీసం ఆరు నెలల పాటు కొనసాగించబడాలి.
నిపుణుల అభిప్రాయం
ఉద్యోగావకాశాల పెంపు, ఉద్యోగ భద్రత, ఆర్థిక మద్దతు అనే మూడు లక్ష్యాలను చేరుకోవడమే ఈ పథక ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు యాజమాన్యాలు కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి ప్రోత్సాహం పొందుతాయని వారు పేర్కొన్నారు.
Also Read : Rupee Growth : రూపాయి స్వల్పంగా పుంజుకుంది – డాలర్‌తో పోల్చితే 88.11 వద్ద ముగింపు



















