TTD : తిరుపతి – శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది టీటీడీ. తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో భక్తులకు పూర్తి స్థాయిలో అన్నప్రసాద వితరణకు చర్యలు చేపట్టాలని టిటిడి ఈవో జె. శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టిటిడి (TTD) పరిపాలనా భవనంలోని కార్యానిర్వాహణాధికారి ఛాంబర్ లో జేఈవో వి. వీరబ్రహ్మంతో కలిసి ఈవో సమీక్ష నిర్వహించారు.
TTD Review
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఒంటిమిట్టలో ఏప్రిల్ 11వ తేదీన జరిగిన శ్రీకోదండరామ స్వామి కల్యాణోత్సవంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుమల తరహాలో ఒంటిమిట్టలో భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని ఆదేశించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఒంటిమిట్టలో భక్తులకు పూర్తి స్థాయిలో అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఆలయం వద్ద ప్రస్తుతం తాత్కాళికంగా జర్మన్ షెడ్స్ ఏర్పాటు చేసి ఆగష్టు మాసం నుండి అన్నప్రసాదాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు ఇంజనీరింగ్, అన్నప్రసాదాల విభాగం అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అన్నప్రసాదాల వితరణకు అవసరమైన మౌళిక సదుపాయాలు, వంట సామాగ్రి, అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్ఏ అండ్ సీఏవో ఓ. బాలాజీ, సీఈ టివి సత్యనారాయణ, ఎస్.ఈలు జగదీశ్వర్ రెడ్డి, మనోహరం, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తిరుమలకు వెళ్లే చాలా మంది భక్తులు ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామ స్వామి ఆలయాన్ని దర్శించు కోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్బంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్నదానం లేక పోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు వెంటనే అన్న ప్రసాద వితరణ నిరంతరం జరిగేలా చూడాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడను ఆదేశించారు.
Also Read : TTD Interesting Update : వేద పండితులకు గౌరవ వేతనం – టీటీడీ



















