TTD EO : తిరుమల : తిరుమలలోని పాత భవనాలను భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది ఉపయోగంలోకి తీసుకురావాలని టీటీడీ (TTD) ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో నిరుపయోగంగా ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ భవనాన్ని అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన పరిశీలించారు.
TTD EO Shyamala Rao Comments
ఈ సందర్భంగా భవన పరిస్థితిపై ఆరా తీస్తూ మరమ్మతులు చేయడం లేదా ఆ ప్రాంతంలో కొత్త భవనాన్ని నిర్మించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. అంతకు ముందు హెచ్ వీడీసీ, బాలాజీ నిలయం, తిరుమల మందిరం (ఆంప్రో రెస్ట్ హౌస్) విశ్రాంతి భవనాలను పరిశీలించి పరిస్థితిని బట్టి మరమ్మతులు, పునర్నిర్మాణంపై కార్యాచరణ రూపొందించు కోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలనలో టీటీడీ సీఈ సత్య నారాయణ, ఈఈ వేణు గోపాల్, డిప్యూటీ ఈవో భాస్కర్, పంచాయతీ & రెవెన్యూ డిప్యూటీ ఈవో శ్రీ వేంకటేశ్వర్లు పాల్గొన్నారు . ఇదిలా ఉండగా టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ఫేస్‌బుక్‌లో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఖాతాను సృష్టించి, భక్తులకు సందేశాలు పంపుతూ డబ్బులు కావాలని కోరుతున్నారని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఇది పూర్తిగా మోసగాళ్ల నకిలీ చర్యగా గుర్తించడం జరిగిందని పేర్కొంది.
భక్తులు ఇటువంటి నకిలీ అకౌంట్లకు దూరంగా ఉండాలని, ఎవరికైనా ఇలాంటి సందేహాస్పద సందేశాలు వస్తే వెంటనే టీటీడీ విజిలెన్స్ విభాగానికి చెందిన సెల్ నెం: 9866898630. లేదా టీటీడీ టోల్ ఫ్రీ నెం: 18004254141 కు ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని కోరింది.
Also Read : TTD Chairman B R Naidu Interesting : వకుళమాత ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం
















