తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి అత్యవసరంగా సోమవారం తిరుమలలో సమావేశమైంది. వైకుంఠ ద్వార దర్శనాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షత వహించారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వి. వీరబ్రహ్మంతో పాటు టీటీడీ బోర్డు సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఈసారి టీడీడీ ఆధ్వర్యంలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖులు, వీఐపీలు, ప్రజా ప్రతినిధులు, సెలెబ్రిటీలకు షాక్ ఇచ్చారు. సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. ఆయన చెప్పినట్టుగానే ఈసారి డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు ఉచితంగా , ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఆయన తీసుకున్న నిర్ణయానికి కోట్లాది మంది భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఇవాళ జరిగిన సమీక్షా సమావేశంలో ప్రధానంగా వైకుంఠ ద్వారా దర్శనాల కోసం పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు రానున్నారని, ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు ఈవో . ఈ కీలక సమావేశంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, మంత్రి అనగాని సత్య ప్రసాద్, టీటీడీ చైర్మన్ నాయుడు హాజరయ్యారు. ఈ వైకుంఠ దర్శనాలు 10 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఆఫ్ లైన్ లో కాకుండా ఈసారి లక్కీ డిప్ ద్వారా భక్తులకు టోకెన్లు కేటాయించింది టీటీడీ. ఈ కీలక మీటింగ్ లో టీటీడీ ఉన్నతాధికారులతో పాటు జిల్లా ఎస్పీ ఎల్ .సుబ్బారాయడు, ఎస్పీసీఎస్వో పాల్గొన్నారు.
