పత్తి కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి

జిల్లా మానిటరింగ్ కమిటీలలో రైతులను భాగస్వాములను చేయాలి

hellotelugu-Tummala

హైద‌రాబాద్ : రాష్ట్రంలో రానున్న 2026-27 పత్తి సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలు ఏర్పాట్లపై సీసీఐ అధికారులతో హైద్రాబాద్ లోని గోల్కొండ హోటల్లో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కష్టపడి పంట పండించిన రైతులకు మార్కెటింగ్‌లో ఎక్కడా ఇబ్బంది కలగకూడదని, ఒకరిద్దరి కారణంగా మొత్తం వ్యవస్థలకు చెడ్డపేరు రాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. “మనం బతకాలంటే రైతు బతకాలి” అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని పని చేయాలని అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లి పత్తి రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పంట కోతకు దాదాపు రెండు నెలల ముందుగానే పత్తి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రకృతిపై ఆధారపడి పత్తి సాగు చేసే రైతులలో సన్న చిన్నకారు రైతులే అధికంగా ఉన్నందున, వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు ప్రక్రియను ముందుగానే పకడ్బందీగా సిద్ధం చేయాలని ఆదేశించారు. పత్తి కొనుగోలు ప్రక్రియలో మధ్యవర్తుల జోక్యానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని మంత్రి స్పష్టం చేశారు. రైతుల నుంచి నేరుగా, పారదర్శకంగా పత్తి కొనుగోలు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. గత సీజన్లలో పత్తి కొనుగోళ్లపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం గుర్తించిన అంశాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకుని, ఈ సీజన్‌లో అటువంటి లోపాలు, అవకతవకలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

2026-27 సీజన్‌లో రాష్ట్రంలో సుమారు 46.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని, సుమారు 25.85 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా వేసినట్టు మంత్రి తెలిపారు. ఈ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.8,667 కనీస మద్దతు ధర ప్రకటించిందని, గత ఏడాదితో పోలిస్తే రూ.557 ఎంఎస్పీ పెరిగిందని చెప్పారు. ప్రతి అర్హత కలిగిన రైతుకు ప్రయోజనం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతులు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ కంటే తక్కువ ధరకు పత్తిని విక్రయించే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దని అన్నారు. రాష్ట్రంలోని 356 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసి పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా L1 నుంచి L12 వరకు అన్ని కేటగిరీల మిల్లులను అవసరానికి అనుగుణంగా ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 15 నుంచి 30 రోజుల వ్యవధిలో అన్ని జిల్లాల్లో మిల్లులు అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.

Exit mobile version