పెనుకొండ/శ్రీసత్యసాయి : రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ఆసక్తి కలిగిన యువత ముందుకొస్తే సబ్సిడీ రుణాలు అందజేసి, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటుకు వెన్నుదన్నుగా ఉంటామని ప్రకటించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని కొండంపల్లి గ్రామంలో ఫెర్టిలైజర్స్, పౌల్ట్రీ ఫీడ్ విక్రయ శాలలను మంత్రి సవిత శుక్రవారం ప్రారంభించారు.
అనంతరం తనను కలిసి విలేకరులతో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో యువతకు సంబంధించిన ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు ఎస్. సవిత. ఇందులో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆసక్తి కలిగిన యువతతో చిన్న, మధ్యతరహా పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందజేసి, వారికి వెన్నుదన్నుగా నిలువనుందని మంత్రి సవిత వెల్లడించారు.

















