కాకినాడ : మారుతున్న టెక్నాలజీని విద్యార్థులు అంది పుచ్చుకోవాలని సూచించారు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. కాకినాడ జేఎన్టీయూ లో విద్యార్థులతో జరిగిన ముఖా ముఖి సందర్బంగా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. దేశంలోనే ఉభయ గోదావరి జిల్లాలు ధాన్యాగారంగా పేరొందాయి. ఆక్వాలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నాయి. అయితే స్థిరమైన అభివృద్ధి సాధించడం అవసరం. గత 18నెలలుగా రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తున్నాయి. ఆ వాతావరణాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరి పైనా ఉంది. డిజైన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ వంటివి ముఖ్యం. డిజిటల్ ట్విన్స్ ద్వారా వరదలను ముందుగా పసిగట్టే సాంకేతికతలపై దృష్టి సారించాలి. ఆక్వాలో ప్రపంచంలో నెం.1 స్థానంలో ఉన్నాం. ట్రంప్ టారీఫ్ కారణంగా కొత్త మార్కెట్లను వెతుకున్నాం. సమకాలీన సమాజం ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలు పరిష్కరించే దిశగా విద్యార్థులు పరిశోధనలపై దృష్టి పెట్టాలని అన్నారు
నేను యుఎస్ కార్నెగీ మెల్లన్ కళాశాలలో ఇంజనీరింగ్ చేశా. అటెండెన్స్, హోం వర్క్, క్లాస్ పార్టిసిపేషన్ వంటి అంశాలకు విభాగాల వారీగా అక్కడ మార్కులు ఇస్తారు. మాకు వేరే వాళ్లతో రాయించే విధానం లేదు. ఎంత నేర్చుకున్నాననే విషయంపైనే నేను దృష్టి పెట్టాను. నేను బట్టీపట్టే టైప్ స్టూడెంట్ ను కాదు. క్రిటికల్ ఎనలిటికల్ థింకింగ్ పై దృష్టి పెట్టాను. విద్యా మంత్రిగా కూడా అలాగే ఆలోచిస్తున్నా. వేరే వాళ్ల పేపర్ చూసి రాయాలనే ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న ఎఐ మిమ్మల్ని ఇంప్రూవ్ చేస్తుంది. కానీ దాని పైనే పూర్తిగా ఆధారపడటం సబబు కాదు. మీ ఆలోచన శక్తిని, సృజనాత్మకతను వదులు కోవద్దని సూచించారు నారా లోకేష్.
















