తిరుమల : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ కామెంట్స్ చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రమైన తిరుమల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన కుటుంబంతో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులతో ముచ్చటించారు స్వయంగా. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో టీటీడీ పనితీరుపై సమీక్ష చేపట్టారు సీఎం. కీలక సూచనలు చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తిరుమలకు వచ్చే భక్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
పవిత్రతను కాపాడుతూ భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భక్తుల విశ్వాసాన్ని చూరగొనేలా సాంకేతికతను జోడించి అత్యున్నత ప్రమాణాలతో కూడిన సేవలందించాలని టీటీడీకి దిశా నిర్దేశం చేశారు. ప్రసాదాల తయారీలో వాడే నెయ్యి, ఇతర ముడి పదార్థాల నాణ్యతను పరీక్షించేందుకు ఏర్పాటు చేసిన అత్యాధునిక ల్యాబ్‌ను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని అన్నారు. కల్తీకి ఏమాత్రం ఆస్కారం ఉండకూడదని హెచ్చరించారు. క్యూలైన్లలో సామాన్య భక్తుల ఇబ్బందులు తొలగించేందుకు ఏఐ టెక్నాలజీ వినియోగించాలని సూచించారు.
తిరుమల సహా 57 దేవాలయాల్లో అన్న ప్రసాదం జరుగుతోందని, మరో 4 దేవాలయాల్లో త్వరలోనే అన్నదానాన్ని ప్రారంభించ బోతున్నామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. నేడు జరిగిన ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, పలువురు ప్రజా ప్రతినిధులు, టీటీడీ ఉన్నతాధికారులు, తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు.



















