విజయవాడ : సమర్థవంతమైన నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏపీ రాష్ట్రం అన్ని రంగాలలో ప్రగతి పథంలో ముందుకు సాగుతోందన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. మంత్రి నారా లోకేష్ గారి మార్గనిర్దేశంలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున పోరాడడం, సమస్యలపై ఉద్యమించడం అనే సంప్రదాయాన్ని టీడీపీ 44 సంవత్సరాలుగా కొనసాగిస్తోందని చెప్పారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్నడూ చూడని పాలన చూశామని, ఆ సమయంలో పార్టీగా, నాయకులుగా, కార్యకర్తలుగా తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన చెందారు. టీడీపీని రాజకీయంగా అంతమొందించాలనే ఉద్దేశంతో కేసులు పెట్టారని, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని జైలుకు పంపినా పార్టీ వెనక్కి తగ్గలేదన్నారు.
రాష్ట్రాన్ని కాపాడాలి, భవిష్యత్తును నిలబెట్టాలి అనే లక్ష్యంతో చంద్రబాబు వీరోచితంగా పోరాడారన్నారు. గత ఐదేళ్ల దుర్మార్గపు రాజకీయాలు, అరాచకాలు చూసిన ప్రజలు 2024లో కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించారని చెప్పారు అచ్చెన్నాయుడు. టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మిస్తుందని నమ్మి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిస్థితి చాలా దయనీయంగా ఉండటంతో, రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలమా అనే ఆందోళన కూడా వచ్చిందన్నారు. అయితే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు నాయకుడిగా ఉండటం మన అదృష్టమని అన్నారు.
