అమరావతి : సమాజంలో తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేసే పరిస్థితులు బాధాకరం. ఇటువంటి రోజుల్లో ఏజ్ కేర్ ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు అత్యాధునిక కేర్ సెంటర్ నిర్మించడం అభినందనీయం అని అన్నారు మంత్రి నారా లోకేష్. నేను మీకు చేయగలిగింది ఒకటే. పిల్లలకు అంగన్‌వాడీ స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు కేవలం విద్యను అందించడం కాకుండా విలువలు, నైతికతతో కూడిన విద్య అందించాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రిగా నాపై ఉంది అని అన్నారు. చాగంటి కోటేశ్వరరావుకి కేబినెట్ ర్యాంక్‌తో అడ్వైజర్ బాధ్యతలు అప్పగించినా, ఆయన ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు తీసుకోలేదు. పిల్లలకు విలువలు నేర్పే పుస్తకాలను రూపొందించి వాటిని ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలని మాత్రమే ఆయన కోరారు. ‘అమ్మకి చెప్పలేని పని ఏదీ చేయొద్దు’ అనే చాగంటి కోటేశ్వరరావు మాట ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా ఉండాలి అని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.
వృద్ధులను గౌరవంగా చూసుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులకు రూ.4,000, వికలాంగులకు రూ.6,000 పెన్షన్ అందిస్తోందని చెప్పారు నారా లోకేష్. వృద్ధులు సమాజంలో గౌరవంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన” అని పేర్కొన్నారు .సేవా కార్యక్రమాలకు విరాళాలు అందించిన దాతలందరూ సమాజానికి మార్గదర్శకులు అని అన్నారు లోకేష్. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయం. పాలియేటివ్ కేర్ సెంటర్ రాష్ట్రంలోనే ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది. ఇది దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచేలా అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సివిల్ సొసైటీ, ప్రభుత్వం, అధికారులు కలిసి పనిచేస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ఈ ప్రాంగణం ఒక చక్కటి ఉదాహరణ అని ప్రశంసించారు. యువత కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి అని మంత్రి పిలుపునిచ్చారు.
