విజయవాడ : రాజమండ్రిలో మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ రెడ్డి. సోమవారం స్పందించారు. తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి, అనేక కష్టాలను ఎదుర్కొని ప్రియాంకను డాక్టర్‌ని చేశారన్నారు. ఎండీ చదువులు కూడా చదివిస్తున్నారు. తమ కుమార్తె ప్రయోజకురాలై, పది మందికీ వైద్య సేవలందించే స్థాయికి ఎదిగిందన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు లేకుండా పోవడం అత్యంత విచారకరం అని పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు జగన్ రెడ్డి.
డాక్టర్ ప్రియాంక కేసులో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యమై పోయిన తీరు మరోసారి బయట పడిందన్నారు. కేవలం ప్రతిపక్షంమీద, ప్రశ్నించే వారిమీద, తప్పులు ఎత్తి చూపుతున్న వారి మీద రెడ్‌బుక్ రాజ్యాంగంతో చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మరోవైపు సామాన్యులకు సంబంధించిన కేసుల విషయంలో చట్ట ప్రకారం నడుచు కోవడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఘోరంగా విఫలం కావడం దురదృష్టకరం అన్నారు.
ఆగస్టు 3వ తేదీ రాత్రి ఈ ఘటన ఒక షాపింగ్‌మాల్ గేటు బయటే జరిగితే, వాళ్లు మద్యం తాగి ఉన్నారని తెలిసినా, వెంటనే సీసీ కెమెరాలు చూసి, నేరం తీవ్రతను బట్టి కేసులు పెట్టాల్సింది పోయి దాన్ని సాధారణ యాక్సిడెంట్ కేసుగా చిన్నదిగా చూపించి, నిందితులను కూడా వదిలేసి పోలీసులు చేతులు దులుపేసుకునే కార్యక్రమం చేయడం అత్యంత దారుణం అన్నారు..నిందితులు తమ కారుతో డాక్టర్ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటర్‌ను ఢీకొట్టడమే కాదు, తర్వాత కూడా వారు అమానవీయంగా ప్రవర్తించి, బాధితురాలి మీద నుంచి కారు తోలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఇంత అలసత్వంగా ఎందుకు పనిచేసిందన్నదానిపై పూర్తి స్థాయి విచారణ జరగాలన్నారు. డాక్టర్ ప్రియాంక తండ్రి ఆవేదనకు ఈ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు జగన్ రెడ్డి.
















