Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై ఆర్థిక ఒత్తిడిని కొనసాగిస్తూ, ఇటీవలి నిర్ణయంతో సుంకాల స్థాయిని 25 శాతం నుండి 50 శాతానికి పెంచారు. భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు చేయడమే ఈ నిర్ణయానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ (Donald Trump) నిర్ణయం భారతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనున్నదని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత్‌పై అదనపు టారీఫ్‌లు విధించడం అన్యాయమైనదిగా, అసమంజసమైనదిగా పేర్కొంది. ఇది అత్యంత దురదృష్టకర నిర్ణయమని తెలిపింది. “భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. రష్యా నుండి చేసే చమురు దిగుమతులు మార్కెట్ ఆధారితంగానే ఉంటాయి. ఉక్రెయిన్ యుద్ధంతో ఏర్పడిన అంతర్జాతీయ అస్థిరతల కారణంగానే ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది,” అని విదేశాంగ శాఖ పేర్కొంది.
Donald Trump – ట్రంప్ ప్రకటనపై రాజకీయ పార్టీలు స్పందన
అమెరికా విధించిన కొత్త సుంకాలపై భారత రాజకీయ వర్గాల్లో తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Sashi Tharror) మాట్లాడుతూ, “ఈ నిర్ణయం భారతీయ ఉత్పత్తులపై అమెరికా మార్కెట్‌లో ప్రభావం చూపిస్తుంది. భారత ఉత్పత్తులు అక్కడి వినియోగదారులకు అందుబాటులో ఉండకపోవచ్చు. వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో పోలిస్తే, భారత్‌పై అధిక సుంకాలు విధించబడుతున్నాయి. భారత్ ఇప్పుడే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి,” అని తెలిపారు.
ఇందులో భాగంగా బ్రిటన్‌తో ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉన్నదని ఆయన గుర్తు చేశారు. అయితే ట్రంప్ తాజా ప్రకటన దేశానికి ఎదురుదెబ్బగా మిగిలిందని అభిప్రాయపడ్డారు.
ఎకానమీపై బ్లాక్‌మెయిల్ ప్రయత్నమా?
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. 50 శాతం సుంకాలు విధించడం ఒక రకమైన ఆర్థిక బ్లాక్‌మెయిల్‌కు సమానమని పేర్కొన్నారు. భారత్‌ను అనుకూలమైన వాణిజ్య ఒప్పందంలోకి నెట్టేందుకు అమెరికా ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. ఈ పరిణామాలపై ప్రధానమంత్రి మౌనంగా ఉండటం ప్రజలకు శాపంగా మారకూడదని హెచ్చరించారు.
ఇదే అంశంపై శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాకరే మాట్లాడుతూ, “ఈ విధమైన నిర్ణయాలపై కేంద్ర మంత్రులు స్పందించకపోవడం ప్రశ్నార్థకంగా ఉంది. ప్రభుత్వం మౌనంగా ఉండే కారణమేంటి?” అని నిలదీశారు.
Also Read : Stock Market Sensational : ట్రంప్ టారిఫ్ తో భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్


















