రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లపై దుష్ప్రచారం నమ్మవద్దు

భక్తులకు సమగ్ర సమాచారం.. సేవల్లో అత్యాధునిక సాంకేతికత

hellotelugu-TTDITGM

తిరుమ‌ల : తిరుమలకు విచ్చేసే భక్తులకు సమగ్ర సమాచారం, మెరుగైన సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వేంకటాద్రి యాప్‌ను ప్రారంభించినట్లు టీటీడీ ఐటీ జీఎం వేంకటేశ్వర్లు నాయుడు తెలిపారు. తిరుమల రాంభగీచా-2లోని మీడియా సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృతంగా ఐటీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు. దర్శన క్యూలైన్ల నిర్వహణను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. త్వరలో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు వెల్ల‌డించారు. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు.

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజున గ్యాలరీ పాసుల జారీకి క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంద‌ర్బంగా ఇటీవ‌ల త‌న‌పై కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని విమ‌ర్శ‌లు, నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌పై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని వేంకటేశ్వర్లు నాయుడు విజ్ఞప్తి చేశారు. టికెట్లు పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉండగా, వాటికి పదిరెట్లు అధికంగా డిమాండ్ ఉండటంతో టికెట్లు లభించక పోవడాన్ని వెబ్ సైట్‌లో సమస్యగా భావిస్తున్నారని తెలిపారు.

టీటీడీ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడం సాధ్యం కాదని, థర్డ్ పార్టీ యాప్‌లు, ఆటో ఫిల్లింగ్, కాపీ-పేస్ట్ టూల్స్ ద్వారా టికెట్లు బుక్ చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని గుర్తించి ఎప్పటికప్పుడు బ్లాక్ చేస్తున్నట్లు చెప్పారు. భక్తులకు నాణ్యమైన సేవలు అందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. దర్శన టికెట్ల బుకింగ్‌పై సందేహాలుంటే టీటీడీ అధికారిక హెల్ప్‌లైన్‌ను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా టిటిడి అధికారిక వెబ్ సైట్ ద్వారా శ్రీవారి దర్శనం, వసతి తదితర సేవలను బుక్ చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ సీపీఆర్వో డాక్టర్ టి. రవి, శ్వేత డైరెక్టర్ డాక్టర్ వేమా వేంకటరత్నం పాల్గొన్నారు.

Exit mobile version