విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నిర్వహించే ఎలాంటి ఆధ్యాత్మిక, ధార్మిక, భక్తి కార్యక్రమాల గురించైనా కేవలం దేవస్థానం జారీ చేసే అధికారిక ప్రకటనలను మాత్రమే భక్తులు విశ్వసించాలని ఆలయ కార్య నిర్వహణాధికారి వీకే శీనా నాయక్ కోరారు . సోషల్ మీడియా వేదికగా అనధికారిక వ్యక్తులు చేసే తప్పుడు ప్రకటనలు, ప్రచారాలను అస్సలు నమ్మవద్దని ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 17వ తేదీన దేవస్థానంలో నిర్వహించనున్న ‘ఉచిత అక్షరాభ్యాస మహోత్సవం’ గురించిన వివరాలతో దేవస్థానం జూన్ 12 సాయంత్రం ఒక అధికారిక ప్రెస్ నోట్‌ను విడుదల చేసిందని తెలిపారు. అన్ని ప్రధాన ప్రసార మాధ్యమాలలో ఆ వివరాలు ఈరోజు అనగా 13 జూన్ న ప్రచురితమయ్యాయని పేర్కొన్నారు.
అయితే, కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దేవస్థానం ఇచ్చిన అధికారిక సమాచారంలో లేని అంశాలను, తప్పుడు వివరాలను జోడించి AI (కృత్రిమ మేధ) సాంకేతికత ద్వారా ఒక నకిలీ పోస్టర్‌ను సృష్టించారని ఆరోపించారు ఈవో. ఆ తప్పుడు పోస్టర్‌ను సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ చేయడంతో, అది చూసిన భక్తులు తీవ్ర గందరగోళానికి గురై నిజా నిజాలు తెలుసుకోవడానికి దేవస్థాన కార్యాలయానికి ఫోన్ల ద్వారా సంప్రదించారని వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఈవో శీనా నాయక్ స్పందించారు. భక్తులను తప్పుదోవ పట్టించేలా, దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించేలా ఇలాంటి నకిలీ AI పోస్టర్లను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
అమ్మవారి ఆలయ కార్యక్రమాలకు సంబంధించిన ఏ సమాచారమైనా దేవస్థాన అధికారిక వెబ్‌సైట్ (www.kanakadurgamma.org) ద్వారా మరియు టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ :18004259099 ద్వారా మాత్రమే చెక్ చేసుకోవాలని కోరారు. పుకార్లను నమ్మవద్దు అని ఈవో స్పష్టం చేశారు.
