తిరుపతి :నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణ మహోత్సవంతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 7.30 నుండి 9 గంటల మధ్య శుభ మిధున లగ్నంలో వైఖానసాగ మోక్తంగా ధ్వజారోహణ ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు.
ధ్వజస్తంభం వద్ద విశేష పూజలు, భేరితాడనం, ధ్వజపటం, ఆస్థానం వంటి కైంకర్యాలను భక్తిశ్రద్ధలతో చేపట్టారు. అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, వివిధ పండ్లరసాలతో అభిషేకాలు నిర్వహించి విశేషారాధనలు చేపట్టారు.సాయంత్రం ఊంజల్‌సేవ భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తగా, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు పెద్దశేష వాహనసేవ వైభవంగా జరిగింది.
ఇదిలా ఉండగా జూన్ 4వ తేదీ రాత్రి 8.30 గంటలకు నిర్వహించే శ్రీ స్వామి వారి కల్యాణోత్సవానికి టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. విచ్చేసే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, ప్రసాదాల పంపిణీకి ప్రత్యేక చర్యలు చేపట్టారు . ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండ్ కె. శ్రీనివాసులు రెడ్డి, డీఈ శ్రీ భాస్కర్, అర్చకులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.
