హైదరాబాద్ : రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వచ్చే రెండు, మూడు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీని తీసుకు రాబోతున్నామని ప్రకటించారు. జర్నలిస్టుల సమస్యలపై శాసన మండలిలో బుధవారం పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. జర్నలిస్టు మిత్రులకు భద్రత కల్పించే విషయములో ఈ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని స్పష్టం చేశారు. అక్రిడేషన్ కార్డుల జారీ విషయములో కొంత మంది లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడేషన్ కార్డులు జారీచేస్తాం అని చెప్పారు.
ఎలాంటి భేషజాలకు పోకుండా మొదట విడుదల చేసిన జీ.ఓ. పై అన్ని జర్నలిస్టుల సంఘాల అభిప్రాయాలను, సూచనలను తీసుకొని జీ.ఓ.లో మార్పులు చేర్పులు చేసామని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. డెస్క్ జర్నలిస్టులు మరో జర్నలిస్టులనే తేడా తమ ప్రభుత్వానికి లేదన్నారు .ఇండ్ల స్థలాల విషయములో కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికి ఈ విషయములో ముఖ్య మంత్రి స్పష్టత ఇచ్చారని, న్యాయస్థానం పరిధిలో ఇబ్బందులు లేకుండా ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి కార్యాచరణ సిద్దం చేస్తున్నామని వెల్లడించారు.
ఇదే సమయంలో ప్రతిపక్షాలపై సీరియస్ అయ్యారు మంత్రి. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా మాధ్యమాలలో పని చేస్తున్న జర్నలిస్టులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తమ సర్కార్ అందరికీ అండగా ఉంటుందన్నారు.
















