ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి కల్యాణోత్సవాన్ని తన్మయత్వంతో తిలకించారు. రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంతకోరిక కార్యక్రమాన్ని 6 గంటలకు వేదిక మీద అర్చకులు నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా భగవత్ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోక కల్యాణం కోసం సంకల్పం చేయించారు. కల్యాణంలోని పదార్థాలన్నీ భగవంతుని మయం చేసేందుకు పుణ్యాహ వచనం నిర్వహించారు. ఆ తరువాత రక్షా బంధనం, యజ్ఞోపవీతధారణ, వరప్రేశనం (కన్యావరణం), మధు పర్కార్చనం చేశారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదివారు.
రాముల వారి వంశ స్వరూపాన్ని స్తుతించారు. అగ్ని ప్రతిష్టాపన తరువాత సీతా రాముల తల మీద జీలకర్ర, బెల్లం ఉంచి శాస్త్రోకంగా కల్యాణ వేడుక నిర్వహించారు. తరువాత మంగళాష్టకం, చూర్ణిక పఠించి, మాంగళ్య సూత్ర పూజ, మంగళ సూత్రధారణ, అక్షతారోపణం చేపట్టారు. స్వామి నివేదన, వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కల్యాణఘట్టం పూర్తయింది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో శ్రీ సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. కల్యాణవేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో కూర్చుని శ్రీ సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు విచ్చేసిన భక్తులందరికి శ్రీవారి సేవకులు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం, ముత్యంతో కూడిన తలంబ్రాలను పంపిణీ చేశారు.
