తిరుమల : తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఇవాళ అత్యంత వైభవంగా గరుడసేవ జరిగింది. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించారు. గజరాజులు ముందు నడుస్తుండగా, భక్త బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి ఊరేగింపు భక్తిభావంతో సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ “గోవిందా… గోవిందా…” అంటూ స్వామి వారిని దర్శించుకున్నారు. 108 వైష్ణవ దివ్య దేశాల్లో గరుడ సేవకు అత్యంత విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. గరుడుడు జ్ఞాన, వైరాగ్యాలకు ప్రతీకగా భావించ బడతాడు.
గరుడ వాహనంపై స్వామివారిని దర్శించు కోవడం సర్వపాప ప్రాయశ్చిత్తానికి, జ్ఞానవైరాగ్య ప్రాప్తికి దోహదం చేస్తుందని భక్తుల విశ్వాసం . ఈ గరుడ సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డా. ఎస్. వేంకటేశ్వర్, జేఈవోలు డా. ఎ. శరత్, ప్రభల గోపీనాథ్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సీవీఎస్వో కె.వి. మురళీకృష్ణ, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఉత్సవాలను పురస్కరించుకుని భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రశాంతంగా గరుడ సేవ ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏకంగా లక్షా 80 వేల మందికి పైగా భక్తులు గరుడ సేవకు హాజరైనట్లు సమాచారం.

















