హైదరాబాద్ : అభివృద్ది ఫలాలు చివరి దాకా చేరితేనే దేశం , రాష్ట్రాలు బాగు పడతాయని అన్నారు ప్రముఖ సామాజిక కార్యకర్త కైలాష్ సత్యార్థి. హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో పాల్గొన్నారు. దీనికి 42 దేశాల నుండి అన్ని రంగాల నుండి 2,500 మందికి పైగా నాయకులు హాజరయ్యారు. ఇక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులు, మహిళలు, పిల్లలు, ఇతర అణగారిన ప్రజల కోసం చేసిన అద్భుతమైన పనిని తాను అభినందిస్తున్నానని చెప్పారు. అంతే కాకుండా అద్బుతంగా తయారు చేసిన విజన్ 2047కు పూర్తిగా మద్దతు ఇస్తున్నానని ప్రకటించారు కైలాష్ సత్యర్థి.
ఆర్థిక వృద్ధి సమ్మిళితంగా, స్థిరంగా ఉండి, దాని ప్రయోజనాలు చివరి వ్యక్తికి చేరేలా చూసుకున్నప్పుడు మాత్రమే ముఖ్యమైనదని నొక్కి చెప్పారు. లేకపోతే, వృద్ధి అసమానతలను తీవ్రతరం చేస్తుందని అన్నారు. సామాజిక సమైక్యతను బలహీన పరుస్తుందని చెప్పారు. ఇది కరుణా నాయకత్వాన్ని తప్పనిసరి చేస్తుంది. కరుణ దయ కాదు.ఇది న్యాయం, సమానత్వం, శాంతి, స్థిరత్వాన్ని నడిపించే శక్తివంతమైన, చురుకైన శక్తి. కరుణతో నడిపించబడిన నాయకులు దుర్బలులను ఉద్ధరించే, వృద్ధిని నిజంగా పంచుకునే వ్యవస్థలను సృష్టిస్తారని అన్నారు కైలాస్ సత్యార్తి. ఫక్తు వ్యాపార దృక్ఫథంతో కాకుండా మానవీయ కోణంతో ఆలోచించాలని, ఆ దిశగా పథకాలను రూపొందించాలని సూచించారు.















