హైదరాబాద్ : రాబోయే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో శాశ్వత భవనాలు లేని గ్రామ పంచాయతీలు అన్నింటికీ శాశ్వత భవనాలు నిర్మించాలని ఆ మేరకు పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం వివేక్ లతో కలిసి ఆయా శాఖల సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, స్థలాలు అందుబాటులో ఉన్నచోట తాసిల్దార్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాలు కలిపి నిర్మించే అవకాశాలు పరిశీలించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని అన్నారు.. చిన్నారుల మెదడు బలంగా ఎదిగేందుకు అవసరమైన పౌష్టిక ఆహారంతో పాటు బోధనా పద్ధతులతో వారికి తర్ఫీదు ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఉపాధి కల్పించే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో కోర్సులు రూపొందించాలని, గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఎంఓయు కుదుర్చుకున్న కంపెనీలను సంప్రదించి అందుకు అనుగుణంగా ఏటిసి సెంటర్లలో కోర్సులు ప్రవేశ పెట్టాలని సూచించారు. క్యూర్, ప్యూర్, రేర్ పాలసీకి అనుగుణంగా వచ్చే పరిశ్రమలను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో కోర్సులు ప్రవేశ పెట్టాలని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం., స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక మైనింగ్ ట్రైబల్ ఏజెన్సీల ద్వారా మాత్రమే జరగాలని ఈ క్రమంలో ఏజెన్సీలకు ఐటీడీఏ ల నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందించాలని అన్నారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేసి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులకు సూచించారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు.
సమావేశంలో ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సిఎస్ సంజయ్ కుమార్, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, సీసీఎల్ఏ సెక్రటరీ లోకేష్ కుమార్, మహిళా, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రామచంద్రన్, దివ్య దేవరాజ్, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ గౌతం , డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.















