అమరావతి : దర్శి నియోజకవర్గం అభివృద్దికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. సచివాలయంలో తనను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు
దర్శి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, యువ నేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు.. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ దర్శి నియోజకవర్గంలోని గ్రామీణ అంతర్గత రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణ ప్రాంతాలలో శాశ్వత తాగునీటి అవసరాలు తీర్చే విధంగా అవసరమైన నిధుల మంజూరు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వెనుకబడిన దర్శి ప్రాంతంలో అనేక అంతర్గత రోడ్లు, డ్రైన్లు గ్రామీణ ప్రాంతాలలో ఇంకా పూర్తి కావలసి ఉన్నాయని వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు . సీఎం నారా చంద్రబాబునాయుడు ఆనాడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి ముందుకు తీసుకు వెళుతున్నామని ఆమె వివరించారు.
ఈ సందర్భంగా ప్రజల నాడీ తెలిసిన యువ డాక్టర్లు మీరు, ప్రజలకు ఏం కావాలో మీకు తెలుసు. ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత తీసుకోండి, ప్రజల్లో ఉండండి, ప్రజల సమస్యలు తీర్చండి. ప్రజల ప్రతినిధులుగా ప్రజల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మనపై ఉంది అందుకు నా సంపూర్ణ సహకారం అందుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అంతే కాకుండా దర్శి అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఇటీవల తుఫాను తాకిడికి కురిచేడు మండలం బోధనంపాడు గ్రామంలో కుప్పకూలిన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని, తాగు నీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో దర్శి పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తానని హామీ ఇచ్చినట్లు డాక్టర్ లక్ష్మీ ఈ సందర్భంగా తెలిపారు.
