హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ పేదలకు తీపి కబురు చెప్పింది. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో దరఖాస్తుల స్వీకరణ గడువును మరో ఐదు రోజుల పాటు పొడిగించింది. ఆగస్టు 15వ తేదీ శనివారం వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది. అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చి, నామమాత్రపు ధరలోనే పేద, మధ్యతరగతి ప్రజలకు సొంత ఇంటిని అందించాలన్నది లక్ష్యమని పేర్కొంది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పథకం ద్వారా లక్ష ఇళ్లను నిర్మిస్తున్నామని, అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా 16 నియోజకవర్గాల్లో 7,340 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని వెల్లడించింది.
ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కోసం ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని, పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయని తెలిపింది. అయితే రెండో శనివారం, బోనాల పండుగ తదితర వరుస సెలవుల కారణంగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా గడువు పొడిగించాలంటూ వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది సర్కార్. తొలుత ప్రకటించిన ప్రకారం దరఖాస్తుల స్వీకరణ గడువు ఆగస్టు 10 వరకు మాత్రమే ఉండగా ఇప్పుడు మరో ఐదు రోజుల పాటు అప్లై చేసేందుకు ఛాన్స్ ఇచ్చినట్లు స్పష్టం చేసింది. గత నెల జూలై 21వ తేదీ నుంచి మీ-సేవా కేంద్రాలతో పాటు ఆన్‌లైన్ ద్వారా, మీ-సేవా వాట్సాప్ సేవ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారని తెలిపింది. ఇ్తప్పటి వరకు 46,121 దరఖాస్తులు అందినట్లు వెల్లడించింది.
ఇళ్ల కేటాయింపు ప్రక్రియపై దరఖాస్తుదారులు ఎటువంటి అపోహలు, అనుమానాలకు గురికావాల్సిన అవసరం లేదని కుండ బద్దలు కొట్టింది సర్కార్. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా ఇళ్ల కేటాయింపు ప్రక్రియను నిర్వహిస్తామని స్పష్టం చేసింది.















