తిరుపతి : తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు భక్తుల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఇందులో భాగంగా 6వ రోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజ స్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.
అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజ స్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. తెప్పలను అధిరోహించిన స్వామి, అమ్మ వార్లు పుష్కరిణిలో మొత్తం ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఎఫ్ ఏ అండ్ సీఏవో ఓ బాలాజీ, ఎస్ ఈలు వేంకటేశ్వర్లు, ఎ. నరసింహ మూర్తి, ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, వీజీవో సురేంద్ర, ఏఈవో నారాయణ చౌదరి, డీఈ రవిశంకర్ రెడ్డి, అర్చకులు , సిబ్బంది పాల్గొన్నారు.


















