తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణి చేస్తామని టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ఒంటిమిట్టలోని పరిపాలనా భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒంటిమిట్టలో శ్రీకోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 27వ తేదీ నుండి ఏప్రిల్ 5 తేదీ వరకు 9 రోజులు పాటు వైభవంగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం శ్రీరామనవమి ఉత్సవాలు ఒంటిమిట్టలో రాష్ట్ర పండుగగా చేపడుతూ వస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా టిటిడి ఆధ్వర్యంలో 2016 నుంచి శ్రీరామ నవమి ఉత్సవాలు, శ్రీ రాముల వారి కళ్యాణం నిర్వహిస్తున్నామని తెలిపారు బీఆర్ నాయుడు.
ఈ ఓంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయానికి ఘనమైన చరిత్ర ఉందన్నారు. 14వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం ప్రారంభమై 17వ శతాబ్దంలో ముగిసిందని శాసనాలు చెబుతున్నాయని పేర్కొన్నారు టీటీడీ చైర్మన్. క్రీ. శ 1356లో బుక్కరాయలు ఈ ఆలయాన్ని నిర్మాణం ప్రారంభించారని చెప్పారు. విజయనగర రాజులు అంతరాలయం ,రంగ మండపం ,మహా ప్రాంగణం గోపురం నిర్మించారని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 1వ తేదీన సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని స్పష్టం చేశారు. శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసేభక్తులకు ఉచితంగా రూ. 50 విలువగల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అందిస్తామన్నారు. దాదాపు లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. అందుకు తగినట్లుగానే ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నామన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు త్రాగు నీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణి చేస్తాం అని తెలిపారు బీఆర్ నాయుడు.


















