హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కీలక తీర్పు ఇవ్వనుంది రాష్ట్ర హైకోర్టు. ఇప్పటికే చట్టం తీసుకు వచ్చినా అది ఇప్పట్లో అమలులోకి వచ్చేలా లేదు. తాజాగా పెద్ద ఎత్తున కోర్టులో పిటిషన్లు పార్టీ తరపున దాఖలు చేయాలని చూస్తోంది. ఈ అంశం ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రచార అస్త్రంగా మారింది. ఇక స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు మంజూరు చేసే జీవో 9కు మద్దతుగా అక్టోబర్ 6న తెలంగాణ హైకోర్టులో సామూహిక పిటిషన్లు దాఖలు చేయాలని వెనుకబడిన తరగతుల (బీసీలు) సామాజిక వర్గానికి చెందిన నాయకులు నిర్ణయించారు. పెంచిన బీసీ కోటాపై పెండింగ్‌లో ఉన్న కేసును సమీక్షించడానికి, న్యాయ పరమైన ఆమోదం పొందేందుకు వ్యూహాన్ని రూపొందించడానికి సీనియర్ బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ కూడా పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు కీలక ప్రకటన చేసింది. ఈనెల 8న జీవో 9ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించనుంది. మరో వైపు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. బీసీ రిజర్వేషన్లను పెంచాలనే కాంగ్రెస్ ప్రభుత్వ చర్యను హైలైట్ చేయడానికి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీసీ గర్జన ర్యాలీని నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇక ర్యాలీకి సంబంధించి ఇంకా తేదీ ఖరారు చేయలేదు. వేదిక ఎక్కడనేది కూడా ఇంకా ప్రకటించ లేదు కాంగ్రెస్ పార్టీ. ఇదే సమావేశంలో జీవో 9కు మద్దతుగా వ్యక్తిగత పిటిషన్లు దాఖలు చేయడం ద్వారా కొనసాగుతున్న కేసులో వాదించాలని బీసీ నాయకులు నిర్ణయించారు. దీనికి మద్దతుగా బీసీ మంత్రులు, శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాలు సామూహికంగా పిటిషన్లు దాఖలు చేయనున్నారు.
