ముంబై : ఐసీసీ చైర్‌పర్సన్‌గా జే షా తిరిగి ఎన్నికైనందుకు బీసీసీఐ అభినందనలు తెలిపింది. జే షా పునర్నియామకం అనేది క్రికెట్‌కు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా, అలాగే ఆయన నాయకత్వంపై ఐసీసీ బోర్డు ఉంచిన నమ్మకానికి నిదర్శనంగా పరిగణించ బడుతోంది. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశాల్లో డైరెక్టర్ల ప్రతిపాదన మేరకు జే షా ఏకగ్రీవంగా రెండోసారి ఐసీసీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2019 నుండి 2024 వరకు బీసీసీఐ గౌరవ కార్యదర్శిగా పని చేశారు జే షా ఆ కాలంలో భారత క్రికెట్‌ను బలోపేతం చేసేందుకు అనేక కీలక కార్యక్రమాలను చేపట్టారు. ఆయన హయాంలో మహిళా ప్రీమియర్ లీగ్ ప్రారంభం కావడం, అంతర్జాతీయ మ్యాచ్ ఫీజుల్లో మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమాన వేతనం కల్పించడం, సీనియర్ పురుష క్రికెటర్ల కోసం ‘టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్’ ప్రవేశపెట్టడం, దేశవాళీ టోర్నమెంట్లలో ప్రైజ్ మనీని పెంచడం , బెంగళూరులో ‘బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను అభివృద్ధి చేయడం వంటి ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి.
తన పదవీ కాలంలోనే భారత్ ఆతిథ్యమిచ్చిన ‘ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023’ చరిత్రలోనే అత్యధిక ప్రేక్షకులు హాజరైన క్రికెట్ టోర్నమెంట్‌గా నిలిచింది. ఐసీసీ చైర్ పర్సన్‌గా ఆయన మొదటి పదవీ కాలంలో, ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ (2025) తిరిగి రావడం, ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ 2025 భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ‘ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026’ వంటి ప్రధాన అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్లు జరిగాయి. 128 సంవత్సరాల తర్వాత 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ క్రీడలకు క్రికెట్ తిరిగి రావడం మరో ముఖ్యమైన మైలురాయి. పురుషుల, మహిళల టీ20 పోటీలు రెండూ ఉండే కార్యక్రమంలో క్రికెట్‌కు చోటు దక్కించు కోవడంలో, ఐసీసీ ఒలింపిక్స్ వర్కింగ్ గ్రూప్‌లో భాగంగా షా కీలక పాత్ర పోషించారు. షాను అభినందిస్తూ, బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ ఇలా అన్నారు. ఐసీసీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా తిరిగి నియమితులైన జే షాను నేను అభినందిస్తున్నాను. ఈ ప్రపంచ స్థాయి పాత్రను చేపట్టక ముందు ఆయన భారత క్రికెట్లోని ప్రతి స్థాయిలో పనిచేశారు, ఆ అనుభవం ఆయన నాయకత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది.
బీసీసీఐలో ఆయన పనిచేసిన కాలంలో క్రికెట్ క్షేత్రస్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు బలోపేతం అయింది, అదే దృక్పథాన్ని ఆయన ఐసీసీకి తీసుకు వచ్చారు. క్రీడలో ఇంతటి మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం, ఆయనపై ఐసీసీ సభ్యులకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. రాబోయే పదవీ కాలానికి బీసీసీఐ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతుంది.. ఐసీసీ చేసే పనులకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ ఇది భారత క్రికెట్‌కు గర్వకారణం. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ ద్వారా క్రికెట్ మళ్లీ ఒలింపిక్ క్రీడల్లోకి ప్రవేశించనున్న తరుణంలో జే షా రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం చాలా ముఖ్యమైన పరిణామం. ఇది క్రికెట్‌ను ఇంతవరకు చేరుకోని కొత్త ప్రేక్షకులకు పరిచయం చేసే అవకాశం కల్పిస్తుందన్నారు.
