జోగులాంబ గద్వాల జిల్లా : మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి వడ్డేపల్లి మండలం తనగల గ్రామ రైతుల సహకారం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు భూములు ఇస్తున్న రైతులకు ఎకరాకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఐడిఓసి సమావేశ మందిరంలో తనగల గ్రామ రైతులతో సమావేశమై మాట్లాడారు. రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పై గత మూడు నెలలుగా తనగల గ్రామ రైతులతో పలుమార్లు మాట్లాడటం జరిగిందన్నారు. కన్సల్ట్ అవార్డు కింద మొదట రూ.12 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలను కున్నప్పటికీ రైతుల విజ్ఞప్తుల మేరకు ఇటీవలే రూ.16.50 లక్షల చొప్పున చెల్లించాలని మాట్లాడడం జరిగిందన్నారు.
కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు భూములు ఇస్తున్న అక్కడి రైతులకు ఇస్తున్న పరిహారం ప్రకారమే తనగల రైతులకు ప్రస్తుతం పరిహారం చెల్లిస్తూ ఉండడం సంతోషంగా ఉందన్నారు. రైతులకు పరిహారంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, రిజర్వాయర్లో చేపల వేట హక్కులు కూడా కల్పించడం జరుగుతుందన్నారు. రిజర్వాయర్ నిర్మాణానికి సహకరిస్తున్న రైతులందరికీ జిల్లా అధికార యంత్రాంగం తరపున ఈ సందర్భంగా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ ఆర్డీఎస్ కింద పూర్తిస్థాయిలో ఆలంపూర్ నియోజకవర్గ రైతుల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణం ఎంతో ప్రతిష్టాత్మకమైనదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనగల గ్రామ రైతులకు న్యాయం చేస్తూ పరిహారం పెంచడం జరిగిందన్నారు.















