ముంబై : ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, అనలిస్ట్, రచయిత హర్ష బోగ్లే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఇండియా, శ్రీలంక దేశాలు సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను నిర్వహిస్తున్నాయి. తొలి సెషన్ పూర్తయింది. మొత్తం ఎనిమిది జట్లు బరిలో నిలిచాయి. విచిత్రం ఏమిటంటే నిన్నటి దాకా టైటిల్ ఫేవరేట్ గా ఉన్న బలమైన ఆస్ట్రేలియా ఆదిలోనే ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇది ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పోయేలా చేసింది. ఇక భారత జట్టు విషయానికి వస్తే వరుసగా నాలుగు మ్యాచ్ లలో గెలిచింది. అభిమానుల ఆశలను మరింత సజీవంగా ఉండేలా చేసింది. ఈ తరుణంలో టీమిండియా పరంగా పలు సమస్యలు ఎదుర్కొంటోంది.
భారతీయ ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ లు ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ లలో శర్మ డకౌట్ అయ్యాడు. ఇక శాంసన్ నమీబియాతో జరిగిన మ్యాచ్ లో మాత్రమే 8 బంతులు ఎదుర్కొని మూడు సిక్సులు, ఒక ఫోర్ తో 24 రన్స్ చేశాడు. ఆ తర్వాత తనను తీసుకోలేదు. అనుకోని విధంగా ఇషాన్ కిషన్ ఒక్కడే రాణిస్తున్నాడు. తనకు తోడుగా తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా జతకట్టారు. ప్రస్తుత జట్టు ఆటతీరుపై హర్ష బోగ్లే స్పందించాడు. నిజం చెప్పాలంటే ఈ జట్టు ప్రపంచ కప్ గెలుస్తుందని తాను అనుకోవడం లేదన్నాడు. ఇప్పటి వరకు అసోసియేట్ జట్లను మాత్రమే ఓడించిందన్నాడు. కానీ సూపర్ -8లో బలమైన జట్లతో ఆడితే ఇంకెన్ని బలహీనతలు బయట పడతాయోనని పేర్కొన్నాడు బోగ్లే.
