హైదరాబాద్ : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అసలైన వారధులు, కళ్లు లాంటి వాళ్లు కలెక్టర్లు అని పేర్కొన్నారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కలెక్టర్లు ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు ప్రభుత్వ ఆలోచనలు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని స్పష్టం చేశారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన జోగులాంబ గద్వాల జిల్లా , కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ తదితర జిల్లాల కలెక్టర్లు నేడు సచివాలయంలో మర్యాద పూర్వకంగా పొంగులేటితో భేటీ అయ్యారు.
ఈ సందర్బంగా వారిని ఉద్దేశించి కీలక సూచనలు చేశారు మంత్రి పొంగులేటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని స్పష్టం చేశారు. ప్రజలతో మమేకం కావాలని, ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని వారికి సూచించారు.
ఐఏఎస్ అధికారుల కెరీర్లో జిల్లా కలెక్టర్లుగా పని చేయడం కీలకమని అన్నారు. , ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలుండే బాధ్యతలతో పాటు క్షేత్ర స్థాయిలో అన్ని అంశాలపై అవగాహన వస్తుందని చెప్పారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. జిల్లాల్లో పని చేసిన అనుభవమే భవిష్యత్తులో ఉపయోగ పడుతుందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజాపాలనలో ప్రజాకేంద్రంగా పాలన సాగాలని , ప్రజలకు మేలు చేసే పనులనే జిల్లా పాలకులుగా చేపట్టాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాల ఫలాలు అర్హులైన ప్రతిఒక్కరికి అందించాల్సిన బాధ్యత మీపైనే ఉందని గుర్తు చేశారు.


















