చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సోమవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు అసెంబ్లీలో పెరంబూరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్వీకర్ ఎంవీ కరుప్పయ్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రులు, పలువురు కీలక నాయకులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలుత ప్రొటెం స్పీకర్ సంక్షిప్త పరిచయ ప్రసంగం చేశారు.
ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీ సభ్యుడిగా తొలుత ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రులు ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున సహా మరో తొమ్మిది మంది మంత్రులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. తర్వాత డీఎంకే శాసనసభాపక్ష నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్ కూడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కే పళనిస్వామి, డీఎంకే నేత ఓ పన్నీర్‌సెల్వం కూడా ప్రమాణం చేశారు. అగ్రి కృష్ణమూర్తి, కేపీ అన్బళగన్‌తో సహా ఏఐఏడీఎంకే సభ్యులు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఊహించని రీతిలో భారీ సీట్లను చేజిక్కించుకుంది టీవీకే పార్టీ. 234 స్థానాలకు గాను 108 సీట్లను కైవసం చేసుకుంది. అధికారం ఏర్పాటు చేసేందుకు గాను ఇంకా 10 సీట్లు కావాల్సి వచ్చింది. దీంతో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు బహిరంగంగా మద్దతు ఇచ్చాయి.

















