CM Revanth Reddy : హైదరాబాద్ – అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనిపై నిగ్గు తేల్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. దీనిని నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఇదిలా ఉండగా సభ అర్ధ రాత్రి వరకు కొనసాగింది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏకంగా 9 గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చ జరిగింది.
CM Revanth Reddy Key Comments
కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణంపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ విచారణ కమిషన్ నివేదికపై శాసనసభలో చర్చించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాము ఏర్పాటు చేసిన కమిషన్ తన తుది నివేదికను గత జూలై 31 వ తేదీన ప్రభుత్వానికి సమర్పించిందన్నారు సీఎం. ఆగస్టు 4వ తేదీన జరిగిన మంత్రిమండలి సమావేశం ఆ నివేదికను ఆమోదించిందని తెలిపారు. తదుపరి చర్చ కోసం నివేదికను శాసనసభ ముందు ఉంచాలని నిర్ణయించామన్నారు. ఆ మేరకు ఈ అంశంపై శాసనసభలో చర్చ జరిగిందని చెప్పారు.
జస్టిస్ ఘోష్ కమిషన్ తన నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించిందన్నారు. తీవ్ర నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దే శపూర్వకంగా వాస్తవాలను తొక్కి పెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించిందన్నారు. మూడు బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చి చెప్పిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA నివేదిక ప్రకారం మేడిగడ్డ నిర్మాణ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేల్చిందన్నారు. నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించిందన్నారు. ఈ అంశాలన్నింటిపై లోతుగా, మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ, విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయని తెలిపారు సీఎం.
ప్రాజెక్టులో అంతర్ రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్రాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలుపంచుకున్నాయని చెప్పారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్‌లో, వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పీఎఫ్సీ, ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐకి అప్పగించడం సముచితమని తాము భావించామన్నారు.
Also Read : Jajula Srinivas Goud Interesting : 50 శాతం సీలింగ్ ను ఎత్తి వేయడం భేష్
















