తెలంగాణ పోలీసుల‌కు సీఎం కంగ్రాట్స్

పోలీస్ డ్యూటీలో ఓవరాల్ ఛాంపియ‌న్

Hellotelugu-CM

హైద‌రాబాద్ : తెలంగాణ పోలీసులు అరుదైన ఘ‌న‌త సాధించారు. ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో వరుసగా మూడోసారి ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకుని హ్యాట్రిక్ సాధించారు. ఈ సంద‌ర్బంగా పోలీసులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ విజయం రాష్ట్ర పోలీసుల నిరంతర కృషి, క్రమశిక్షణకు నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ సీఐడీ పర్యవేక్షణలో నిరంతర శిక్షణ ఈ విజయానికి కారణమైందని, జాతీయ స్థాయిలో మరోసారి ప్రతిభ చాటడం ఆనందంగా ఉంద‌న్నారు. ప్ర‌త్యేకించి పోలీసుల‌కు పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చి, ప్రోత్స‌హించినందుకు గాను డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి, సీఐడీ అద‌న‌పు డీజీ చారు సిన్హాల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు రేవంత్ రెడ్డి.

ఇదిలా ఉండ‌గా తెలంగాణ పోలీసుల విజయ పరంపర గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతోంది. 2024 లక్నో (ఉత్తరప్రదేశ్‌)లో, 2025 రాంచీ (ఝార్ఖండ్‌) లో జరిగిన పోటీలతో పాటు తాజాగా 2026లో నాగ్‌పూర్ (మహారాష్ట్ర) లో మార్చి 29 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగిన 69వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్‌ ఛాంపియన్‌షిప్ 2025-26లో విజయం సాధించి తెలంగాణ ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి నాగ్‌పూర్‌లో జరిగిన డ్యూటీ మీట్‌లో తెలంగాణ ప్రతినిధి బృందం అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీతో పాటు యాంటీ-సాబోటేజ్ చెక్, వీడియోగ్రఫీ, కంప్యూటర్ అవేర్‌నెస్ విభాగాల్లో విజేతగా నిలిచింది. శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు సహాయాలు, పోలీస్ ఫోటోగ్రఫీ విభాగాల్లో రన్నరప్‌గా నిలిచింది.

Exit mobile version