CM Chandrababu : గుంటూరు జిల్లా : అనారోగ్యమే నిజమైన పేదరికమని, అందుకే ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా పెదకాకాని శంకర కంటి ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఐదు దశాబ్ధాలుగా శంకర ఆస్పత్రి పేదలకు ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతోందని కొనియాడారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో నడుస్తున్న శంకర కంటి ఆస్పత్రి లో నూతన భవన నిర్మాణ ప్రారంభోత్సవంలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానని, నిస్వార్థంగా సేవలు చేసే ఇలాంటి సంస్థలకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ప్రకటించారు.
CM Chandrababu Important Update
మానవ సేవనే మాధవ సేవ అని నమ్ముతుంది కాబట్టే కంచి పీఠం దేశ వ్యాప్తంగా కంటి ఆస్పత్రులు స్థాపించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తోందని చెప్పారు. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన కంచి పీఠం ఆది నుంచి హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడుతోందని ప్రశంసించారు నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). అందులో భాగంగానే ఆది శంకరాచార్యులు దేశంలోని నాలుగు ప్రాంతాల్లో నాలుగు పీఠాలను స్థాపించారని అన్నారు. హిందూ ధర్మాన్ని తిరిగి బలమైన శక్తిగా మలిచారని పేర్కొన్నారు. 1977లో ప్రారంభమైన శంకర కంటి ఆస్పత్రి సామాన్యులకు సైతం నేత్ర చికిత్సలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. త్వరలో జరిగే స్వర్ణోత్సవ కార్యక్రమానికి తాను తప్పకుండా హాజరవుతానని చెప్పారు సీఎం.
50 ఏళ్ల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 14 ఐ హాస్పిటల్స్ నిర్మించడం సాధారణ విషయం కాదన్నారు. ఇప్పటి వరకు 30 లక్షల మందికి ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు, 70 లక్షల మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేయడం గొప్ప విషయం అని ప్రశంసించారు చంద్రబాబు నాయుడు. ఈ ఆస్పత్రుల్లో రోజుకి సగటున 750 ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేస్తున్నారని తెలిపారు. రెయిన్‌బో ప్రోగ్రామ్ ద్వారా ప్రత్యేకంగా పిల్లల కంటి ఆరోగ్యంపై దృష్టి పెట్టడాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. శంకర గ్రామీణ సేవా ప్రాజెక్ట్ ‘గిఫ్ట్ ఆఫ్ విజన్’ కింద ఇప్పటివరకు 32,000కు పైగా కంటి శిబిరాలు నిర్వహించడం వారి సేవా గుణానికి నిదర్శనమని సీఎం పేర్కొన్నారు.
Also Read : Minister Atchannaidu – Govt Strong Focus : గ్రామీణ సాధికారతపై ప్రభుత్వం ఫోకస్


















