అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు జిల్లా కలెక్టర్లపై. జలధారతో జలహారతి కార్యక్రమానికి ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసుకోవాలని స్పష్టం చేశారు. వీలైనంత వరకు నిధుల కొరత రానీయకుండా చూస్తాం అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నిధుల కంటే చిత్తుశుద్ధి ముఖ్యం అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడాన్ని జిల్లా కలెక్టర్లు బిగ్ ఛాలెంజ్ గా తీసుకోవాలని ఆదేశించారు. టీమ్ లీడర్లుగా కలెక్టర్లు వ్యవహరించి అందర్నీ భాగస్వాములను చేయాలని అన్నారు. ప్రజా భాగస్వామ్యంతోనే జలహారతి కార్యక్రమం సక్సెస్ అవుతుందన్నారు. కలెక్టర్లు ఏ మేరకు చొరవ తీసుకుంటున్నారనేది ఈ కార్యక్రమంతో క్లారిటీ వస్తుందని చెప్పారు సీఎం. జలధార కార్యక్రమంలో చెరువులు చాలా కీలకం అని పేర్కొన్నారు. ప్రతి చెరువునూ నింపాలన్నారు.
మైనర్ బేసిన్లు, సబ్ బేసిన్లు, క్యాస్కేడ్లు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఎన్ని ఉన్నాయో చూడాలన్నారు చంద్రబాబు నాయుడు.. వాటికి నీటి సౌకర్యం కల్పించాలన్నారు.. వాటి సోర్సెస్ నుంచి నీరు రాకుంటే… దానికి కారణాలు వెలికి తీయాలని సూచించారు. ప్రతి చెరువును నింపాలి.. భూగర్భ జలాలను పెంచాలి. ప్రతి కాల్వను బాగు చేయాలని అన్నారు. గుర్రపు డెక్క, సిల్ట్ తొలగింపు వంటి అంశాలపై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు. ఇది జరిగితే వర్షాకాలంలో ముంపు బాధ తప్పుతుందన్నారు. ఇదే లక్ష్యంతో కలెక్టర్లు కార్యాచరణను సిద్దం చేయాలని ఆదేశించారు సీఎం. నీటి రక్షణతో వ్యవసాయం మెరుగవుతుందన్నారు. విద్యుత్ ఆదా అవుతుందని తెలిపారు. స్వర్ణాంధ్ర పది సూత్రాలు కూడా నీటి సంరక్షణ చర్యలతో సక్సెస్ చేయవచ్చు అని అన్నారు. జిల్లాల జీఎస్డీపీ, రాష్ట్ర జీడీపీ పెరగడానికి ఈ కార్యక్రమం దోహద పడుతుందన్నారు.















