హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అన్ని విధాలుగా సంపూర్ణ సహకారం ప్రభుత్వ పరంగా కల్పిస్తామని ప్రకటించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆయనతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు సినీ ప్రముఖులు. సీఎంతో ప్రత్యేకంగా వీరంతా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నటులు జెనీలియా, అక్కినేని అమల, పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు.
రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు ఎ. రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని వివరించారు. 24 క్రాఫ్ట్స్ లో సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్థానికులను ట్రైన్ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు కావాల్సిన సదుపాయలు తక్షణమే కల్పిస్తామని స్పష్టం చేశారు. స్క్రిప్ట్ తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్ళేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందన్నారు ఎ. రేవంత్ రెడ్డి.

















