తిరుపతి : చంద్రగ్రహణం కారణంగా మంగళవారం తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని టిటిడి స్థానికాలయాలను మూసివేస్తారు. తిరిగి మార్చి 3వ తేది రాత్రి ఆలయాల తలుపులు తెరిచి శుద్ధి చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 3.20 నుండి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్ర గ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ సూర్య నారాయణస్వామి ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయాలను ఉదయం 9 గంటలకు మూసివేస్తారు. రాత్రి 7.30 గంటలకు తలుపులు తెరుస్తారు. శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం సర్వ దర్శనానికి అనుమతిస్తారు. తిరుపతిలోని శ్రీగోవిందరాజ స్వామి వారి ఆలయాన్ని ఉదయం 9 గంటలకు మూసివేస్తారు. రాత్రి 7.30 తెరిచి, శుద్ధి, పుణ్య హవచనం ఇతర కైంకర్యాల అనంతరం రాత్రి 9 గంటలకు సర్వదర్శనానికి అనుమతిస్తారు.
శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీకోదండరామ స్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వర స్వామివారి ఆలయాలను ఉదయం 9 గంటలకు మూసివేస్తారు. రాత్రి 7.30 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి, బుగ్గలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి, సత్రవాడలోని శ్రీ కరివరదరాజ స్వామి ఆలయం, నగరిలోని శ్రీ కరియ మాణిక్యస్వామి ఆలయాలను ఉదయం 9 గంటలకు మూసివేసి, రాత్రి 7:30 గంటలకు తెరుస్తారు. ఆలయ శుద్ధి, పుణ్యహవచనం తదితర సేవల అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం, వాయల్పాడులోని శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం, కోసువారిపల్లిలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయాలను ఉదయం 9 గంటలకు మూసివేసే రాత్రి 7:30 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు.



















