అమరావతి : కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శుక్రవారం ఏపీలో పర్యటించారు. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్టుల పనితీరును పరిశీలించారు. గురువారం రాత్రి పోలవరం ప్రాజెక్ట్ అతిథి గృహంలో బస చేసిన ఆయన ఉదయాన్నే పర్యటన ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు, డయాఫ్రమ్ వాల్, ఫిష్ లాడెర్ మొదలైన వాటిని ఆయన పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ పనులను తనిఖీ చేశారు. పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ జల విద్యుత్ కేంద్రం పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
పోలవరం ప్రాజెక్ట్, జల విద్యుత్ కేంద్రం పనుల పురోగతి తదితర అంశాలపై శశిభూషణ్ కుమార్ సమీక్షించనున్నారు. కొద్దీ రోజుల క్రితం శశిభూషణ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. శశిభూషణ్ వెంట పర్యటనలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సి ఈ ఓ సంజీవ్ వోహ్రా, చీఫ్ ఇంజనీర్ కే రమేష్ బాబు, ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వర రావు, చీఫ్ ఇంజనీర్ కే నరసింహ మూర్తి, ఎస్ ఈ ఆర్ రామచంద్ర రావు, నిర్మాణ సంస్థ జి ఎంలు ఏ గంగాధర్, ప్రసేన్జిత్ మజుందార్, డీజీఎం మురళి పమ్మి తదితరులు ఉన్నారు.
ఇదిలా ఉండగా ఏపీ కూటమి సర్కార్ పోలవరం పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. పోలవరం కు నిధులు మంజూరు చేయాలని కోరారు.

















