భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్ర‌దేశ్

2027 పూర్త‌య్యే లోపు రాజముద్రతో పాస్ పుస్తకం

heellotelugu-APCM

అమరావతి : ఆంధ్రప్ర‌దేశ్ ను భూవివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్ర‌క‌టించారు. 2027 డిసెంబరు నాటికి సర్వే పూర్తి చేసి రాష్ట్రంలో రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామని వెల్లడించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కలుగొట్ల గ్రామంలో మీ భూమి- మీహక్కు కింద పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. భవిష్యత్ లో ఎవరూ ట్యాంపరింగ్ చేయకుండా, ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని చంద్ర‌బాబు నాయుడు స్పష్టం చేశారు.

ఎవరైనా ట్యాంపరింగ్ కు ప్రయత్నిస్తే నేరుగా జైలుకే వెళతారని, అవసరమైతే పీడీ యాక్టు కింద కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ…మీ భూమికి భద్రత కల్పించడం నాకు ఆనందాన్నిస్తోంది అని అన్నారు. భూమి ఆస్తి ఒక్కటే కాదు..అది మన జీవనాధారం. కుటుంబానికి భద్రత. భవిష్యత్‌కు నమ్మకం. కూటమి ప్రభుత్వం భూమి- నీరు-సాగుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు. వివాదాలు లేని భూములు, పుష్కలంగా ప్రతి ఎకరాకు నీరు, లాభాలు తెచ్చిపెట్టేలా సాగును ప్రోత్సహించటమే లక్ష్యాలుగా పెట్టుకుని పనిచేస్తున్నాం అని ప్ర‌క‌టించారు.

Exit mobile version