చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కో ఆర్కింగ్ స్పేస్ సెంటర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. శనివారం చిత్తూరు జిల్లాలో సీఎం పర్యటించారు. ఈ సందర్బంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పంలో నవదిశ కేంద్రంలో తొలి కో వర్కింగ్ స్పేస్ సెంటర్ ను నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఇందులో విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతి సౌకర్యాలను కల్పించారు.
ప్రధానంగా కో వర్కింగ్ స్పేస్ సెంటర్ లో హైస్పీడ్ ఇంటర్నెట్, ఏసీ, ప్యాంట్రీ, స్టోరేజ్ వసతులతో 50 మంది పని చేసుకునేలా కో-వర్కింగ్ స్పేస్ సెంటర్‌ను రూపొందించారు. ఇదే కాకుండా అదనంగా 40 మంది చదువుకునేలా లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ సహకారంతో రూ.1 కోటి వ్యయంతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటైంది. మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కో-వర్క్ స్పేస్ సెంటర్లలో సౌకర్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు.
ఈ సందర్బంగా నారా చంద్రబాబు నాయుడు కో వర్కింగ్ స్పేస్ సెంటర్ లో ఉన్న విద్యార్థులతో ముచ్చటించారు. చదువుపై ఫోకస్ పెట్టాలని, ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని వాడుకుని వృద్దిలోకి రావాలని పిలుపునిచ్చారు. కూటమి సర్కార్ విద్యారంగం కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోందని చెప్పారు. అంతే కాకుండా టెక్నాలజీలో వస్తున్న మార్పులను గుర్తించి సద్వినియోగం చేసుకునేలా ఫోకస్ పెట్టాలని సూచించారు సీఎం.
