హైదరాబాద్ : ప్రజా పాలనలో ఇచ్చిన మాట ప్రకారం ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. రాబోయే రోజుల్లో జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు.
ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ప్రపంచంతో పోటీ పడే విధంగా యువతను తీర్చిదిద్దే కార్యక్రమాలను చేపడుతామని వెల్లడించారు. ప్రజా పాలనలో కొలువుల పండుగలో భాగంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 శాఖలకు సంబంధించిన గ్రూప్–IIIలో ఎంపికైన 1,370 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను లాంఛనంగా అందించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.
కొత్తగా ఎంపికైన ఉద్యోగులు రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.. పరిపాలనలో ప్రక్షాళన జరగాలంటే సంపూర్ణంగా సహకరించాలని కోరారు. కొత్తగా చేరిన వారంతా చిత్తశుద్ధితో పని చేయాలని స్పష్టం చేశారు. దేశంలోనే అత్యధికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదగాలంటే మీరంతా కష్టపడి పనిచేయాలని అన్నారు రేవంత్ రెడ్డి. తలవంచకుండా 30 నుంచి 35 సంవత్సరాల పాటు తెలంగాణ కోసం తల ఎత్తుకుని పనిచేశానని గర్వంగా చెప్పుకునేలా మీ పనితీరు ఉండాలని స్పష్ట చేశారు .
ఉద్యోగం ఒక భావోద్వేగం అని, ఈ భావోద్వేగం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుందని చెప్పారు రేవంత్ రెడ్డి. తద్వారా తెలంగాణను ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దగలం అని అన్నారు. 4 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే బాధ్యతను మీరు తీసుకోబోతున్నారని పేర్కొన్నారు.
